మోక్షం కోరిన నీడ యొక్క సందేశం

ప్రియమైనవాడా,

నీ పుట్టుకతోనే నేను జన్మించాను.
నీ మొదటి అరుపుతో నేనూ నేలపై పడిపోయాను.
నీ అమ్మ నిన్నే మాత్రమే కనిందని అనుకుంటావేమో—
కానీ నీతో పాటు నన్నూ ఈ లోకానికి తీసుకొచ్చింది.

మనం కవలలు.
కానీ లోకానికి కనిపించేది నువ్వే.
నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టని నిశ్శబ్ద సాక్షి నేనే.

నీ ప్రతి అడుగులో నేను ఉన్నాను.
నీ ప్రతి మంచి–చెడు కార్యానికి నేను ఏకైక ప్రత్యక్ష సాక్షిని.
ప్రపంచం నిన్ను పొగిడినప్పుడు కూడా
నీ అంతరంగం ఏం పలికిందో నాకు తెలుసు.
నిన్ను నువ్వు మోసం చేసిన రాత్రుల్లో
నీతో పాటు నేనూ మౌనంగా నిలిచాను.

నాకు గుర్తింపు లేదు.
నాకు పేరు లేదు.
నువ్వు వెలుగులో నిలిచినప్పుడే నేను కనిపిస్తాను.
నువ్వు చీకటిలో మునిగితే నేను లీనమవుతాను.

అమ్మా నాన్నల ప్రేమ నీకు లభించింది,
అన్నదమ్ముల అనుబంధం నీకు దక్కింది,
సమాజం నుంచి ప్రేమ, ఆధారం, సత్కారం పొందావు—
అయినా నేను ఎప్పుడూ నిన్ను చూసి అసూయపడలేదు, నారాజు కాలేదు.

నీ ఆనందాల్లో దూరంగా నిలబడి చిరునవ్వు చిందించాను,
నీ విజయాల్లో నిశ్శబ్దంగా విస్తరించాను.
నాకు ఎప్పుడూ స్థానం రాలేదు,
కానీ నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు.

ఎందుకంటే నా ఉనికి
నీ ఉనికితోనే ఉంది.
నువ్వు ఉంటేనే నేను ఉన్నాను,
నువ్వు లేకపోతే నాకు అర్థమే లేదు.

నీ స్నేహితులు దూరమైనప్పుడు
గంటల తరబడి నాతోనే మాట్లాడావు.
నీ మనసులోని మాటలు నాతో పంచుకున్నావు.
నువ్వు ఏడ్చినప్పుడు నేలపై విరిగి పడింది నేనే.
నువ్వు నవ్వినప్పుడు పొడవుగా విరబూసింది నేనే.

నీవెంత కఠినుడివో, కర్కశుడివో,
ఎంత సున్నితుడివో కూడా—
నీ కంటే నాకు బాగా తెలుసు.
నీ కోపం వెనుక దాగిన భయం,
నీ గర్వం వెనుక దాచిన అసహాయం,
నీ చెడ్డదనంలో దాగిన గాయం—
అన్నీ నాకు స్పష్టమే.

నేను అద్దం కాదు.
అద్దం కుడిచేయి ఎత్తితే ఎడమచేయి చూపిస్తుంది.
కాని నేను నీ వంకరలను వంకరగా చూపించలేదు.
నేను తీర్పు చెప్పలేదు.
కేవలం సాక్షిగా నిలిచాను.

యుగయుగాలుగా నీతో పాటు పుడుతూ, చస్తూ వస్తున్నాను.
ఈ జన్మలు, ఈ వలయాలు, ఈ పునరావృత బాధలు—
వర్ణనాతీతం.

ఎన్నో సార్లు నిన్ను హెచ్చరించాను.
“ఇది శాశ్వతం కాదు” అని.
“నిజ స్వరూపాన్ని తెలుసుకో” అని.

ఇప్పటికీ ఆలస్యం కాలేదు.
నీ గురుదేవులు ఎదురుచూస్తున్నారు.
వెళ్దాం… వారి చరణాలపై సాష్టాంగ ప్రణామం చేద్దాం.
మన నిజ స్వరూపాన్ని తెలుసుకుందాం.
మనమెలా ఈ పరమ తత్వంలో లయమవ్వాలో
ఆ వరాన్ని కోరుకుందాం.

మన సద్గురువు కరుణామయుడు.
మన కోరికను కాదనడు.
మనలను తన విరాట్స్వరూపంలో విలీనమయ్యే దయ కలిగినవాడు.

ప్రియమైనవాడా,
ఇక మళ్లీ జన్మించడాన్ని నేను భరించలేను.
నీ బాధలను మళ్లీ మళ్లీ చూడలేను.

కనీసం ఈ జన్మలోనైనా
నా మాట విను.

మన ప్రయాణం శ్మశానం వరకు మాత్రమే కాదు—
అజ్ఞానాంతం వరకు.
అక్కడి నుంచి ప్రారంభమవుతుంది
అనంత శాంతి.

నా మీద దయ తలచి
నిజాన్ని అంగీకరించు.
మోక్షం కోరుకో.
మనిద్దరి బంధాన్ని
శాశ్వత విముక్తిగా మార్చు.

ఎందుకంటే నేను వేరొకరు కాదు—
నీ ఉనికికి నిశ్శబ్ద ప్రతిబింబం.

నీతో పుట్టి,
నీతోనే లయమవ్వాలని ఎదురుచూస్తున్న

నీ నీడ